తాజా వార్తలు

10/recent/ticker-posts

ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్


చింతలపూడి, పశ్చిమ వాహిని, మే 01: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. పట్టణంతో పాటు కామవరపుకోట మండలం పోలాసిగూడెం, లింగపాలెం మండలం బంధరాల గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్‌టీఆర్ భరోసా పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భరోసాను అందిస్తోందన్నారు. వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు వంటి లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. పింఛన్లను నేరుగా ఇంటి వద్దకే అందించడం ద్వారా పారదర్శకత పెరిగి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.

అలాగే పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించిన ఎమ్మెల్యే, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పింఛన్లు సకాలంలో అందడం వల్ల తమ జీవనోపాధికి ఎంతో తోడ్పడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, మండల మరియు గ్రామ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.