జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, మే 04: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో సోమవారం సందర్భంగా శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామివారికి ఉచిత పంచామృతాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద పంచలోహ ఉత్సవలింగానికి ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు మాట్లాడుతూ, ప్రతి సోమవారం శివార్చనలు, పంచామృతాభిషేకాలు, ఏకాదశ హారతి పూజలు దాతల సహకారంతో భక్తులకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండితో ఇప్పటికే సగభాగం వెండి చీర తయారు చేసి ఉగాది సందర్భంగా అలంకరించినట్లు తెలిపారు. మిగిలిన భాగం పూర్తి చేసేందుకు భక్తులు వెండి, నగదు లేదా పాత వెండి వస్తువుల రూపంలో విరాళాలు అందించాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ సేవలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని ఆలయ శాశ్వత చైర్మన్ డా. రాజాన సత్యనారాయణ (పండు), కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా బృందాలు, మహిళా కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


