తాజా వార్తలు

10/recent/ticker-posts

పెదపాడు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం – ప్రకాశం జీవితం, యోగా పాఠాలు


పెదపాడు, పశ్చిమ వాహిని, మే 04: ఏలూరు జిల్లా పెదపాడు శాఖా గ్రంథాలయంలో ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం ఉత్సాహంగా కొనసాగుతోంది. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో యోగా టీచర్ దత్తి రేణుక ఎల్లమ్మ విద్యార్థులకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్రను విపులంగా వివరించారు. 1872లో జన్మించిన ప్రకాశం గారు టంగుటూరు గ్రామానికి చెందినవారని, కష్టపడి చదివి బారిష్టర్‌గా ఎదిగి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలందించిన మహానుభావుడిగా ఆయనను కొనియాడారు.


ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తక పఠనంపై ప్రత్యేక దృష్టి సారించారు. రిసోర్స్ పర్సన్స్ కె. పూర్ణకుమారి, వి. విజయలక్ష్మి మార్గదర్శకత్వంలో పెండెం జగదీశ్వర్ రచించిన “ఉపాయం” పుస్తకంలోని “నిజమైన స్నేహం – మేలు చేసిన మతిమరుపు” కథలను విద్యార్థులతో చదివించారు. పఠనం ద్వారా జ్ఞానం పెంపొందించుకోవచ్చని, మంచి విలువలు అలవర్చుకోవచ్చని వివరించారు.

అనంతరం యోగా టీచర్ విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను తెలియజేసి ప్రాయోగికంగా కొన్ని యోగాసనాలను నేర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు మరియు 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు.