లింగపాలెం, పశ్చిమ వాహిని, మే 7: ఏలూరు జిల్లా లింగపాలెం మండల శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన కార్యక్రమాన్ని వందేమాతరం గీతంతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి, ప్రముఖ కవి ఆచార్య ఆత్రేయ 105వ జయంతి, అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటంలో చూపిన ధైర్యసాహసాలను విద్యార్థులకు వివరించారు. బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అల్లూరి త్యాగం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమం ముగింపులో చిన్నారులకు స్నాక్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి ఎస్.ఏ. లతీఫ్, రిసోర్స్ పర్సన్ బి. సునీల్ మరియు గ్రంథాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


