తాజా వార్తలు

10/recent/ticker-posts

శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ – ఆలయ అభివృద్ధికి దాతల విరాళాలు


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, మే 8: పట్టణ ఇలవేల్పు దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు, ఏకాదశ ఆరతి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నారు.


ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించగా, మూలవిరాట్టుకు ఏకాదశ సాయంసంధ్యా ఆరతి పూజలు శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి శంకర్ మహేష్ శర్మ బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు.

రానున్న మే 19న జరగనున్న జయవారం 7వ వార్షిక మహోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. సప్తనదీ జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ఫలరసాలతో విశేష అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి మహా అలంకరణ చేయనున్నట్లు తెలిపారు.

ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధి కోసం పలువురు దాతలు విరాళాలు అందజేశారని తెలిపారు. బాదరాల చస్విత తండ్రి మధుసూదనరావు, జయశ్రీ సమీర కుటుంబ సభ్యులు రూ.5,116 విరాళంగా సమర్పించగా, మసరం శేఖర్–సేతు మాధవి దంపతులు, కానుమోలు వెంకట సుబ్రహ్మణ్యం–హైమావతి దంపతులు, కంచర్ల జ్యేష్టశ్రీ తండ్రి నవీన్ కుటుంబ సభ్యులు మజ్జిగ, పులిహోర ప్రసాద వితరణ నిర్వహించినట్లు చెప్పారు.

అమ్మవారి వెండి చీర తయారీ కోసం భక్తులు వెండి రూపంలో లేదా పాత వెండి వస్తువుల రూపంలో విరాళాలు అందించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది.

శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, వగ్వాల పుల్లారావు కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, చింతకాయల అచ్చిరాజు, కోరుపూరి రాంబాబు, మహిళా సంఘాల సభ్యులు, సేవా బృందం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.