జీలుగుమిల్లి, పశ్చిమ వాహిని, మే 8: అంకన్నగూడెం పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులకు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల పరిశీలనలో భాగంగా ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు గుడెల్లి వెంకట్రావు పూచికపాడు ఉపాధి పనుల ప్రాంతాన్ని సందర్శించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గుడెల్లి వెంకట్రావు మాట్లాడుతూ అంకన్నగూడెం పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల ఉపాధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అన్నారు. పనుల ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసే సిబ్బంది లేకపోవడంతో కూలీలు చేసిన పని నమోదు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కూచికపాడు మరియు పరిసర గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు ప్రజలు వెళ్లడంలేదని, “పని చేసినా ఫోటోలు రాకపోతే పని చేసినట్టే కాదంటున్నారు” అంటూ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఫోటోలు అప్‌లోడ్ కాకపోవడంతో ఐదు నుంచి ఆరు రోజుల పాటు చేసిన పనిదినాలు నమోదు కాకుండా పోతున్నాయని అన్నారు.
తక్షణమే అంకన్నగూడెం ప్రాంతానికి శాశ్వత ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించి, నమోదు కాని పనిదినాలను గుర్తించి కూలీలకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి పనుల ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పాత ఉపాధి హామీ చట్టం ప్రకారం కల్పించినట్లుగా టెంట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని కోరారు.
ఉపాధి కూలీలకు న్యాయం జరిగేలా అధికారులు వెంటనే స్పందించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీతారామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


