తాజా వార్తలు

10/recent/ticker-posts

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగాలి: ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 8: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు తలసేమియా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని రెడ్ క్రాస్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడుహెన్రీ డునాంట్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తలసేమియా భవనంలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ “మానవ సేవే మాధవ సేవ” అనే నినాదంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రజలకు సేవలందిస్తోందని కొనియాడారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు ముందుండి సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా రక్తదాన శిబిరాల ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడుతోందన్నారు.

తలసేమియా అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వంశపారంపర్య రక్తవ్యాధి అని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ప్రతి నెలా రక్త మార్పిడి చేయించుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. వివాహానికి ముందు తలసేమియా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని ప్రజల్లో అవగాహన పెరగాలని సూచించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు శాఖ తలసేమియా చిన్నారులకు రక్తదానం, వైద్య సేవలు, ప్రయోగశాల సేవలు, అవగాహన కార్యక్రమాల ద్వారా విశేష సేవలు అందిస్తోందని ఎమ్మెల్యే ప్రశంసించారు. చిన్నారులకు ఉచిత చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రసాద్ మరియు కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా హీమోఫీలియా రోగుల కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన “ఫ్యాక్టర్స్ అస్సే” శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రెడ్ క్రాస్ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ వి. శ్రీదేవి, హీమోఫీలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహిళా విభాగం దక్షిణ ప్రాంత సమన్వయకర్త షేక్ మెహరున్నిసా, డాక్టర్ నిహారిక తదితరులు తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫీలియా వ్యాధులపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జే. సత్యనారాయణ రాజు, ట్రెజరర్ ఎన్. బ్రహ్మానందం, సభ్యులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, తలసేమియా చిన్నారులు పాల్గొన్నారు.