తాజా వార్తలు

10/recent/ticker-posts

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన – జంగారెడ్డిగూడెంలో పోలీసుల ప్రత్యేక సమావేశం


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, మే 01: ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి సుస్మిత, ఐపీఎస్ ఆదేశాల మేరకు పట్టణంలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాష్, ఎస్‌ఐ వీర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు హాజరయ్యారు. రవాణా క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.


ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు కేవలం వాహనం నడిపేవారు మాత్రమే కాకుండా, తమతో ప్రయాణించే వారి ప్రాణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఆటోలు ప్రధాన ప్రయాణ సాధనమై ఉండటంతో భద్రతపై మరింత శ్రద్ధ అవసరమని సూచించారు. డ్రైవర్లు క్రమశిక్షణతో వ్యవహరించి ప్రజలకు నమ్మకాన్ని కల్పించాలని కోరారు.

ఆటోలలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదకరమని, అదనపు లోడ్ వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. డ్రైవర్ సీటు పక్కన ప్రయాణికులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోబెట్టరాదని స్పష్టం చేశారు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు.

అలాగే రహదారులపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. నిర్ణీత ఆటో స్టాండ్లలోనే వాహనాలను నిలపాలని సూచించారు. ఆటో నడపడం జీవనోపాధి అయినప్పటికీ, అది ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని హితవు పలికారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే, పోలీసులకు సహకరించాలని కోరారు. డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదరహిత జంగారెడ్డిగూడెం నిర్మాణంలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.