తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రకృతి వ్యవసాయానికి ఊతం – గుండుగొలనుకుంటలో PMDS నవధాన్యాల సీడ్ కిట్ల తయారీ


ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మెగా బయో ఇన్‌పుట్స్ రిసోర్స్ సెంటర్ (BRC)లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా PMDS (నవధాన్యాలు) సీడ్ కిట్ల తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యజమాని శ్రీ ఓబిలిశెట్టి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించగా, రైతుల నుంచి మంచి స్పందన లభించింది. మొదటి విడతగా 800 సీడ్ కిట్లను సిద్ధం చేయగా, ఒక్కో కిట్‌లో 25 రకాల విత్తనాలు, మొత్తం 15 కిలోల విత్తన ఉత్పత్తి ఉండేలా రూపొందించారు.


ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ హాజరై తయారీ ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులకు అందుబాటులో ఉండేలా ఒక్కో కిట్‌ను రూ.1400 ధరకు అందిస్తున్నామని తెలిపారు. నవధాన్యాల విత్తనాల వినియోగం వల్ల రైతులకు పలు విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

నవధాన్యాల పంటలు సాగు చేయడం ద్వారా నేల ఎర్రదనాన్ని తగ్గించి, భూమి సంవత్సరం పొడవునా పచ్చగా కప్పబడి ఉండేలా చేస్తాయని వివరించారు. దీనివల్ల కలుపు మొక్కల నియంత్రణ సులభమవుతుందని, నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూసారం మెరుగుపడుతుందని చెప్పారు. అలాగే నేల గుబ్బలా మారి నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు ఎండల సమయంలో పంటలు తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు.

ఇంకా ఈ పంటలు పురుగులు, తెగుళ్లను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు, వానపాముల సంఖ్య పెరిగి జీవ వైవిధ్యం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వేర్ల వ్యవస్థ బలపడటంతో పంటలు వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.

నవధాన్యాల పంటల ద్వారా దిగుబడులు, నాణ్యత, పోషక విలువలు పెరిగి రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఈ పంటలు పశువులకు పచ్చిమేతగా ఉపయోగపడటంతో పాలు ఉత్పత్తి మరియు నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గి ప్రకృతి వ్యవసాయం మరింత విస్తరించడానికి ఇది దోహదపడుతుందని అన్నారు.

భూమి 365 రోజులు పచ్చగా కప్పబడి ఉండటం వల్ల నేల నష్టం తగ్గి, భూతాపం ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఈ కిట్లు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటేష్ తెలిపారు. రైతులకు ఆర్థికంగా, పర్యావరణపరంగా లాభదాయకమైన ప్రకృతి వ్యవసాయానికి ఈ కార్యక్రమం మరో ముందడుగుగా నిలుస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.