తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరు సబ్‌డివిజన్ నేర సమీక్షా సమావేశం – కేసుల వేగవంతమైన దర్యాప్తుకు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదేశాలు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: ఏలూరు సబ్‌డివిజన్ పరిధిలో నేర నియంత్రణ, కేసుల పరిష్కారంపై దృష్టి సారిస్తూ నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలతో కలిసి కేసుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సర్కిల్ వారీగా సమీక్షిస్తూ, దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.


పెండింగ్ కేసులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని డీఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో ఎటువంటి జాప్యం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాలపై పక్కా ఆధారాలు సేకరించాలని సూచించారు. నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం ద్వారా కీలక ఆనవాళ్లు సేకరించవచ్చని పేర్కొన్నారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రజల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై నిరంతర ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

విద్యాసంస్థలకు సెలవులు ఉన్న నేపథ్యంలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, కాలువల్లో స్నానాలకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు.

మహిళలపై నేరాలు, సైబర్ నేరాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణ సహాయం అందించేలా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని డీఎస్పీ దిశానిర్దేశం చేశారు. మారుమూల ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.