తాజా వార్తలు

10/recent/ticker-posts

ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – గోపన్నపాలెంలో విస్తృతంగా పరిశీలన


దెందులూరు/ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: ఈ నెల 25వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మరియు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధులతో కలిసి పర్యటన ప్రాంతాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, వేదికలు, ప్రజా సదుపాయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గ్రామసభ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ ఆరోగ్య కేంద్రం సందర్శించి మహిళలు, గర్భిణీలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో నేరుగా మాట్లాడి సేవలపై అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. అలాగే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశముందని వివరించారు.

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్, వైద్య శిబిరాలను ముఖ్యమంత్రి సందర్శించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్, త్రాగునీరు, భద్రత వంటి అన్ని అంశాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. యం.జె. అభిషేక్ గౌడ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్. సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయాశర్మ, ఆర్డీవో ఐ. కిషోర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.