తాజా వార్తలు

10/recent/ticker-posts

కోరుకొండ పాండవుల మెట్ట వద్ద పెద్దపులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ


కోరుకొండ, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: కోరుకొండ మండలం కాపవరం గ్రామ పరిధిలోని పాండవుల మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం గుర్తించడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. అటవీశాఖ అధికారులతో కలిసి పులి కదలికలపై సమీక్ష నిర్వహించి, ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల రక్షణే ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పులిని పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బోన్లు ఏర్పాటు చేయడం, ట్రాప్ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాల ద్వారా పులి కదలికలను 24 గంటలు పర్యవేక్షించాలని ఆదేశించారు. కీలక ప్రాంతాల్లో ఎరలు ఏర్పాటు చేసి, అటవీశాఖ సిబ్బందితో నిరంతర గస్తీ నిర్వహించాలని తెలిపారు.

గ్రామాల్లో భయాందోళనలు తగ్గించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (QRT) సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత మూడు రోజులుగా పులి ఆహారం తీసుకోలేదని, ఆహారం కోసం వేటాడే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని అధికారులు పేర్కొన్నారు.

ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, కోరుకొండ, సీతానగరం మండలాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బయటకు వెళ్లవద్దని, ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. పశువుల సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని, పులి కదలికలు కనిపిస్తే వెంటనే అటవీశాఖ లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

ప్రభుత్వం, అటవీశాఖ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ, పోలీసు శాఖ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.