తాజా వార్తలు

10/recent/ticker-posts

ఎమ్మెల్సీ అనంతబాబును తొలగించాలి – కొత్తపేటలో ఎస్సీ సంఘాల నిరసన ర్యాలీ


కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తపేటలో ఎస్సీ సంఘాలు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించాయి. రామారావుపేట నుంచి ప్రారంభమైన ర్యాలీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం నాయకులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వ్యక్తి మూడేళ్లు గడిచినా ఇంకా పదవిలో కొనసాగడం అన్యాయమని విమర్శించారు. న్యాయం ఆలస్యమవడం వల్ల బాధిత కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని పదవి నుంచి తొలగించాలని కోరారు.

అదేవిధంగా, నిందితుడిని మరియు అతని సతీమణిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయట స్వేచ్ఛగా ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు విచారణను వేగవంతం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో పల్లి భీమారావు, బూసి భాస్కర్ రావు, కముజు శ్రీనివాస్ రావు, సాదే శ్రీనివాస్, నల్ల రమణ తదితరులు పాల్గొన్నారు.