రాజానగరం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: రాజానగరం నియోజకవర్గం దోసకాయలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి, జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆలయంలో భక్తుల సందడి నెలకొని, కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.
ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం వల్ల ఆధ్యాత్మికత పెరిగి ప్రజల్లో శాంతి, సమరస్యం నెలకొంటాయని అన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన దాతలు, గ్రామ పెద్దలను ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



