ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ నెల 25న దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ (ASL) కార్యక్రమాన్ని నిర్వహించి, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన మార్గాలు, కీలక ప్రదేశాలను అధికారులు పరిశీలించారు. ఎస్పీ స్వయంగా పర్యటన మార్గాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. హెలిప్యాడ్ ప్రాంతం, లబ్ధిదారులకు పథకాలు అందించే వేదికలు, ముఖ్యమంత్రి సందర్శించనున్న గృహాలు, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. పర్యటన సమయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి దశలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రోడ్ల వెంట బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బలగాలతో నిరంతర గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ గాలింపు చర్యలు ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు కొనసాగుతాయని చెప్పారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఉన్నత స్థాయి కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఐఏఎస్, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏఆర్ అదనపు ఎస్పీ జీ. మునిరాజా, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



