టి.నరసాపురం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: టి.నరసాపురం మండలం పంచాయతీ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలో త్రాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సిపిఎం ఏలూరు జిల్లా నాయకులు గూడెల్లి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత 17 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ కాలనీలో ఇప్పటికీ కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం బాధాకరమని ఆయన విమర్శించారు. అధికారులు సమస్యను పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కాలనీలో 45కి పైగా కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ త్రాగునీటి సౌకర్యం లేక మండువేసవిలో నీటి కోసం అల్లాడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. కరెంట్ లైన్ ఏర్పాటు చేసి మోటారు ద్వారా నీరు సరఫరా చేయాలని కోరుతూ మండల అభివృద్ధి అధికారికి మెమోరాండం అందజేశామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
దారిపొడవునా వెళ్లేవారికే చలివేంద్రాల ద్వారా మంచినీరు అందిస్తున్న పరిస్థితిలో, ఇన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న కాలనీ ప్రజలకు తాగునీరు అందకపోవడం విచారకరమని అన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.
అధికారులు తక్షణ చర్యలు తీసుకుని అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలో త్రాగునీరు, కరెంట్ సౌకర్యాలను కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అనుబోలు మురళి, మడకం కుమారి, కుంజ వెంకటేశ్వరరావు, శిరీష తదితరులు పాల్గొన్నారు.



