ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23:
ఉభయ జిల్లాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి కావాలంటే అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన స్థాయి సంఘాల సమావేశంలో ఆమె అధ్యక్షతన వివిధ శాఖల పనితీరు, పెండింగ్ ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర సమీక్ష జరిగింది. అధికారులు తమ తమ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని వివరించారు.
జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనుల్లో కొన్నివరకు ఆలస్యమవుతున్నాయని గుర్తించిన చైర్‌పర్సన్, వాటిని నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ఉండాలని ఆమె అన్నారు.
ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, మురుగునీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవడం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో శుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని ఆమె పేర్కొన్నారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు నింపడం, బోర్ల మరమ్మతులు, నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు తగినంత త్రాగునీరు అందేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను కోరారు.
ఎక్సైజ్ శాఖపై సమీక్ష సందర్భంగా గంజాయి, అక్రమ సారా తయారీ, బెల్ట్ షాప్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆమె హెచ్చరించారు.
ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీరాజ్, డిఆర్డిఏ తదితర శాఖల ద్వారా చేపట్టిన రహదారి నిర్మాణం, పథకాల అమలు, పింఛన్లు, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి వంటి అంశాలపై కూడా సమీక్ష జరిగింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అధికారులు వివరించారు. వివిధ సంక్షేమ పథకాలు లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతున్నాయా అన్న దానిపై చైర్‌పర్సన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సమావేశాలకు హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ హెచ్చరించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించని వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో పి. జగదాంబ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ సభ్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




