నూజివీడు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 22: పట్టణ శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నూజివీడు టౌన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15,080 నగదు మరియు 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
నూజివీడు టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సత్య శ్రీనివాస్ గారికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. 2026 ఏప్రిల్ 21/22 అర్ధరాత్రి సుమారు 00:30 గంటల సమయంలో RR పేట శివార్లలో కొందరు వ్యక్తులు బహిరంగంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది.
దీనిపై స్పందించిన మహిళా హెడ్ కానిస్టేబుల్ (WHC 4109) శ్రీమతి బి. ఝాన్సీ లక్ష్మీ భాయి గారి నేతృత్వంలో పోలీస్ బృందం ఆ ప్రదేశంలో ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ దాడిలో జూదం ఆడుతున్న 10 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అరెస్టయిన వారి వివరాలు జుజ్జువరపు శాంసన్ (52), చలివేంద్రం రాంబాబు (43), పైలా సురేంద్ర (28), నిమ్మకూరి నాగబాబు (34), కాకర్ల వీర రాఘవ రావు (35), తమ్మిశెట్టి రాజేష్ (23), మురారి లక్ష్మీనారాయణ (32), కాలే రమేష్ (37), రుద్రపాటి శ్రీనివాసరావు (66), తగరం సునీల్ కుమార్ (27)గా పోలీసులు వెల్లడించారు.
పట్టుబడిన వారి వద్ద నుంచి మొత్తం రూ.15,080 నగదు మరియు పేకాటకు ఉపయోగించిన 52 కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
పట్టణ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, జూదం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.



