ఏలూరు జిల్లా, నూజివీడు/దెందులూరు పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భిన్నమైన రీతిలో వేడుకలు నిర్వహించడం ఆకట్టుకుంది. నూజివీడు నియోజకవర్గంలోని బోర్వంచ గ్రామంలో మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, దెందులూరులో సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.
నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలోని మజీద్‌లో మదర్సా చిన్నారులతో కలిసి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యుడు పాశం నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులతో కలిసి కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాశం నాగబాబు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తక్కువ కాలంలోనే అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు సంపాదించారని కొనియాడారు.
అలాగే ఆయనకు, వారి కుటుంబానికి అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుతూ జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక మంత్రి కొలుసు పార్థసారథి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు, చిన్నారులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదే సమయంలో దెందులూరు ప్రాంతంలో ఎంపీ అనుచరుడు నందిగాం సీతారామ తిలక్ (బాబి) ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
జిల్లాలో రెండు చోట్ల జరిగిన ఈ వేడుకలు రాజకీయ నేత పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించాయి. సేవా కార్యక్రమాలు, ప్రార్థనలతో కూడిన ఈ జన్మదిన వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి.


