తాజా వార్తలు

10/recent/ticker-posts

మహిళలే మహారాణులు – సాధికారతకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ: ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్


చింతలపూడి/జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండల పరిధిలోని గ్రామ మహిళా సంఘాల సహాయకులకు (VOAలు) స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చింతలపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కామవరపుకోట మండలం నుంచి 53 మంది VOAలకు ఈ ఫోన్లు అందజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మహిళలకు చేరువ కావడం ఎంతో అవసరమని అన్నారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో VOAలు తమ సేవలను మరింత సమర్థవంతంగా అందించగలరని, ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం సమగ్రంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. మహిళలను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు సాధికారత సాధిస్తున్నారని, ప్రభుత్వం వారికి మరింత ప్రోత్సాహం అందిస్తోందని వివరించారు.

ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల పార్టీ నాయకులు, ఏపీఎంలు, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.