తాజా వార్తలు

10/recent/ticker-posts

భగీరథుని స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి – ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: భగీరథ మహర్షి చూపిన పట్టుదల, తపస్సు స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని 23వ డివిజన్ ఫిరంగుల దిబ్బ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు.


మొదట భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చంటి, అనంతరం మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యసాధన కోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన మహర్షి భగీరథుడు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. తన తపస్సుతో గంగను భూమికి తీసుకొచ్చిన ఆయన త్యాగం, కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్ఫూర్తిని అందరూ అలవర్చుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరాలంటే ప్రజలు, నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజ అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాడిశెట్టి గోపీరావు మాట్లాడుతూ, ఏలూరులో భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటులో దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చేసిన సేవలను గుర్తుచేశారు. అదే మార్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి చంటి కూడా సగరుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అభినందించారు.

ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబు, కార్పొరేటర్ కలవకొల్లు సాంబ, క్లస్టర్ ఇన్‌చార్జ్ గూడవల్లి శ్రీనివాస్, టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, డివిజన్ ఇన్‌చార్జ్ రెడ్డి రామకృష్ణ, కో ఇన్‌చార్జ్ అబ్రహం పాలస్, నాయకులు గండికోట సీతారామరాజు, బీజేపీ నాయకులు నడపన భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.