తాజా వార్తలు

10/recent/ticker-posts

ఇంటర్‌లో ప్రతిభ చాటిన వర్షిని, వర్ధినిలకు మంత్రి సుభాష్ అభినందనలు


కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు వర్షిని, వర్ధినిలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించారు. గురువారం కొత్తపేటలోని గుబ్బల మూర్తి నివాసానికి విచ్చేసిన మంత్రి, చదువులో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడం తన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థినులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.


వర్షిని, వర్ధినిలు చెముడులంకలోని షిరిడి సాయి విద్యానికేతన్‌లో చదువుతూ ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో వరుసగా 988, 929 మార్కులు సాధించినట్లు వారి తండ్రి గుబ్బల మూర్తి తెలిపారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం కలిసి విజయాన్ని సాధించడానికి దోహదపడుతాయని మంత్రి పేర్కొన్నారు. వారి ప్రతిభ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులో పూర్తిగా విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్తును నిర్మించేది విద్యేనని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిత్యం పర్యవేక్షణ ఉంచి చదువుపై ఆసక్తి పెంచేలా చేయాలని చెప్పారు.

సమాజంలో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు దొంగ శ్రీను, ముత్యాల బాబ్జి, కంఠంశెట్టి శ్రీనివాస్, తులా రాజు, కడలి భీమా, బొక్క ప్రసాద్, గుబ్బల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.