తాజా వార్తలు

10/recent/ticker-posts

వేతనాల పెంపు, మే నెలకు సెలవులు కోరుతూ అంగన్వాడీ సిబ్బంది వినతి


పోలవరం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కలిసి వినతి పత్రం సమర్పించారు. బరింకలపాడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. వేతనాల పెంపు, వేసవి పరిస్థితుల్లో పనిభారం తగ్గించాలన్న అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.


ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటివరకు తమ వేతనాల్లో ఎలాంటి పెంపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే వేతనాలు పెంచాలని ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరగడంతో అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు హాజరుకావడం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మే నెల మొత్తానికి పూర్తి స్థాయి సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, అంగన్వాడీ సిబ్బంది సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిబ్బంది సంక్షేమం, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చిట్టి బొమ్మ కొండలరావు, ప్రాజెక్ట్ లీడర్ కే. పుష్ప, రామలక్ష్మి, నాగమణి, సుజాత, సుధారాణి, భూదేవి తదితరులు పాల్గొన్నారు.