ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల నేపథ్యంలో ఈ నెల 25న జంగారెడ్డిగూడెంలో రైతు రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ సంక్షోభం, పరిష్కార మార్గాలు, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వంటి కీలక అంశాలపై ఈ సదస్సు జరగనుందని చెప్పారు. సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని వెల్లడించారు.
గురువారం ఏలూరులోని అన్నే భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సదస్సుకు అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన రైతుల సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకుంటారని పేర్కొన్నారు. వివిధ రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్దతు ధరలకు చట్టబద్ధ హామీ కోసం దేశవ్యాప్తంగా రైతు సంఘాలు పోరాడుతున్నాయని గుర్తుచేశారు. ఈ సదస్సు ద్వారా రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలను చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ సదస్సును విజయవంతం చేయడానికి అన్ని వర్గాల రైతులు, రైతు సంఘాలు భాగస్వామ్యం కావాలని కోరారు. రైతుల హక్కుల సాధనలో ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.



