తాజా వార్తలు

10/recent/ticker-posts

“ప్రమాదం… ఆర్థిక కష్టాలు… కానీ ఓ చేయూత మార్పు తెచ్చిందా?”


రావులపాలెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడికి సహాయహస్తం అందింది. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామానికి చెందిన కిషోర్ ప్రస్తుతం రాజమండ్రిలోని సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భారం అయ్యాయి.


ఈ పరిస్థితిని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ట్రెజరర్, కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించి తన మనసును చాటుకున్నారు. ఈ సహాయం ఆలమూరులోని ఆయన నివాసంలో శుక్రవారం అందజేశారు.

గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంబటి సుబ్బలక్ష్మి ద్వారా ఈ ఆర్థిక సాయం బాధితుడి తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు సేవా భావాన్ని కొనియాడారు. సమాజంలో ఇలాంటి సహాయ సహకారాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో రోటె ప్రసాద్, పమ్మి రామకృష్ణ, అంబటి శ్రీనివాసరావు, పమ్మి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి మరిన్ని దాతలు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.