తాజా వార్తలు

10/recent/ticker-posts

ముక్కోల్లపాడులో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభోత్సవం – మంత్రి కొలుసు పార్థసారధి ప్రత్యేక పూజలు


నూజివీడు, పశ్చిమవాహిని, మార్చి 08: నూజివీడు మండలం ముక్కోల్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఆలయానికి విచ్చేసిన మంత్రివర్యులకు వేదపండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రివర్యులను పండితులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. స్వామివారి కరుణతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సీతారామస్వామి చల్లని దీవెనలతో ప్రజలు పాడి పంటలతో సంతోషంగా జీవించాలని అన్నారు.

అలాగే స్వామివారి ఆశీస్సులు రాష్ట్రం పై మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు పై ఉండి రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.