తాజా వార్తలు

10/recent/ticker-posts

నగరంలో అపరిశుభ్రతపై కఠిన చర్యలు: కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరిక


ఏలూరు, మార్చి 28: ఏలూరు నగరంలో అపరిశుభ్ర పరిస్థితులు కనిపిస్తే సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.

శనివారం స్థానిక శాంతినగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్ల పరిస్థితిని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం, డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండడం పట్ల నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా ఉదయం, సాయంత్రం శుభ్రపరిచే పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. డ్రైన్లలో పూడిక తొలగించి, మురుగునీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రోడ్లపై చెత్త, డ్రైన్లలో మురుగు నిల్వ ఉంటే దోమలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర’ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఏలూరు నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్య పనులపై తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రి, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.