తాజా వార్తలు

10/recent/ticker-posts

సంక్షేమ వసతి గృహాల్లో సేంద్రియ కూరగాయల వినియోగం పెంచాలి: కలెక్టర్ వెట్రిసెల్వి


పెదపాడు/ఏలూరు, మార్చి 28: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల వినియోగాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

శనివారం పెదపాడు మండలం వట్లూరులోని వెనుకబడిన తరగతుల బాలికల, బాలుర వసతి గృహాలతో పాటు పీఎం శ్రీ డా. బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల పరిసరాలు, వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను అధికారులతో కలిసి పరిశీలించారు.

అనంతరం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా రసాయనాలు లేని సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలను అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందుబాటులో ఉన్న స్థలాలను వినియోగించి ప్రతి వసతి గృహంలో ప్రకృతి సాగు విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

టమాటా, వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ, మునగ, బీన్స్, తోటకూర, పాలకూర, బచ్చలి, మెంతికూర వంటి కూరగాయలతో పాటు అరటి, జామ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన విత్తనాలు, మొక్కలను వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖల ద్వారా అందించాలని తెలిపారు.

అనంతరం వసతి గృహాల్లో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ఆహార నాణ్యత, మెనూ అమలు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన ఆహారం అందుతున్నదా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్, ఎంఐపీ ప్రాజెక్ట్ అధికారి రామ్మోహన్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, సాంఘిక సంక్షేమాధికారి విశ్వమోహన్ రెడ్డి, ఇంచార్జ్ డీసీఓ భారతి, గురుకుల ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి, తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపీడీఓ జమ తదితరులు పాల్గొన్నారు.