తాజా వార్తలు

10/recent/ticker-posts

గండి చెరువులో ఉపాధి హామీ పనులు నిలిపివేత.. కూలీల ఆగ్రహం


టి. నర్సాపురం, మే 15: టి. నర్సాపురం మండల పరిధిలోని గండి చెరువు లో యంత్రాలతో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేసి, ఉపాధి హామీ పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గండిగూడెం, పాకనాటిగూడెం, కొరివి రామన్నపాలెం గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు.


కూలీలు ఎంపీడీవో జి. మణికుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ హరి బాబు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం. జయబాబు వారికి లిఖితపూర్వక వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు యస్.డి. నాసర్ పాషా, తాటిగడప జయరాజు మాట్లాడుతూ యంత్ర యజమానుల ప్రయోజనాల కోసం పేద కూలీల జీవనాధారాన్ని దెబ్బతీయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల గండి చెరువును సందర్శించిన కొందరు అధికారులు, యంత్రాలతో మట్టి తోలకాలు కొనసాగితే ఉపాధి హామీ పథకంపై ప్రభావం పడుతుందని, పనులను కొనసాగించలేమని తెలిపినట్లు కూలీలు పేర్కొన్నారు. అనంతరం పనులకు అనుమతి లేదని ప్రకటించడంతో సుమారు 150 మంది కూలీలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

గండి చెరువులో యంత్రాలతో జరుగుతున్న మట్టి తవ్వకాలకు అధికారిక అనుమతులున్నాయా లేదా అన్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలియడం లేదని, కానీ వాటి కారణంగా తమ ఉపాధి నిలిచిపోయిందని కూలీలు ఆరోపించారు. ఉపాధి హామీ పనులు తమకు ప్రధాన ఆదారమని, ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లి పని చేయాల్సి రావడం వల్ల ప్రయాణ భారాలు పెరిగాయని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గండి చెరువులో ఉపాధి హామీ పనులను పునఃప్రారంభించాలని, అనుమతి లేని యంత్రాలతో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని కూలీలు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు తలకొండ నాగబాబు, ఉపాధి హామీ కూలీలు కాకాని వెంకటేశ్వరరావు, వీరయ్య, పింగుల పుల్లయ్య, పింగుల బోడియ్య, గంధం యేసు, పరశురాముడు, మరియమ్మ, లక్ష్మి, కుమారి, లక్ష్మీకాంతమ్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.