ఏలూరు, మార్చి 28: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వ ద్వారా మంజూరు అయిన 30 స్కీములుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖలు వారీగా కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన నిధులు, ఇప్పుడు వరకు చేసిన ఖర్చు, మిగిలి ఉన్న నిధులు అడిగి తెలుసుకుని అవి పూర్తిస్థాయిలో పనులు పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టరు సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు అయిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం చేసి, మిగిలి ఉన్న నిధులకు సంబంధించి పనులను పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 02 తేదీన జరిగే డిఆర్ సి సమావేశమునకు నియోజక వర్గాలు, శాఖలు వారీగా పూర్తిస్థాయి నివేదికలు 30 వ తేదీ నాటికి అందించాలని ఆదేశించారు.
సిఎస్ఎస్ మిగిలి ఉన్న నిధులకు సంబంధించి పనులు పూర్తి చేయలేకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు సక్రమంగా మంజూరు కావని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవి పెండింగులో ఉండకూడదని, ప్రతి శాఖ తమకు వచ్చిన నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలని అన్నారు. కేటాయించిన అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేసి, అభివృద్ధి పనులు ప్రజలకు వాడుకలోకి తేవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి, గృహనిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, ఐసిడియస్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, తదితర శాఖలు సంబంధించిన పథకాలు అమలుపై అధికార్లు ప్రత్యేక దృష్టి సారించాలని, గడువు లోగా లక్ష్యాలు పూర్తిచెయ్యని అధికారులుపై శాఖా పరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ పీవో కె.రాములు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాష, జిల్లా గృహనిర్మాణ శాఖ డిడి జి.సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి.హరినాధ బాబు, ఏపి యంఐపి పిడి డా.యస్.రామ్మోహన్,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, జిల్లా మత్స్య శాఖ డిడి బి.రాజ్ కుమార్, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, సర్వశిక్ష అభియాన్ ఎపిడి పంకజ్ కుమార్, ఐసిడి యస్ పిడి పి.శారద, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


