తాజా వార్తలు

10/recent/ticker-posts

వాడపల్లి మార్గంలో చెత్త సమస్య.. భక్తుల ఇబ్బందులు


రావులపాలెం, మే 15: వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానం కు కాలినడకన వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం మండలం పరిధిలో ఉన్న రావులపాడు వంతెన నుంచి వాడపల్లి దేవస్థానానికి వెళ్లే రహదారిపై భారీగా చెత్త పేరుకుపోవడంతో ఆ మార్గం డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్నదని భక్తులు చెబుతున్నారు.


ప్రతిరోజూ అధిక సంఖ్యలో భక్తులు ఈ మార్గంలో కాలినడకన ప్రయాణిస్తుండగా, రహదారిపై పరిశుభ్రత లేకపోవడం, భద్రతా చర్యలు లేకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా చెత్త పేరుకుపోవడం వల్ల దుర్వాసన వ్యాపిస్తూ, పాదయాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.



అదేవిధంగా రహదారి ఇరువైపులా అనధికారంగా గృహాలు నిర్మించారని, అవి పంచాయతీ లేదా ఇరిగేషన్ శాఖ అనుమతులతో నిర్మించబడినవేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే కొందరి చర్యల వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ మార్గం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉండటంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్త తొలగింపు, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని, అలాగే అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారిని సురక్షితంగా, పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.