తాజా వార్తలు

10/recent/ticker-posts

భారతీయ సాంప్రదాయ సాహిత్యానికి కాపాడువాడైన మహామేధావి పుట్టపర్తి నారాయణాచార్యులు: జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 28: శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు భారతీయ సాంప్రదాయ సాహిత్యాన్ని సంరక్షించి, అభివృద్ధి చేసిన గొప్ప మేధావి అని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు.

జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకల్లో జాయింట్ కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రసిద్ధ తెలుగు పండితుడు, కవి, సాహితీవేత్తగా విశేష కీర్తి పొందారని తెలిపారు. సంస్కృతం, తెలుగు సాహిత్యంపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడిగా, రచయితగా, అనువాదకుడిగా వివిధ రంగాల్లో సేవలందించిన ఆయన రచనల్లో కవిత్వం, వ్యాసాలు, సంస్కృత గ్రంథాలు, అనువాదాలు ముఖ్య స్థానాన్ని సంపాదించాయని తెలిపారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీషు వంటి భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన బహుభాషా పండితుడని కొనియాడారు.

శాస్త్రీయ సాహిత్యంలో నిపుణుడిగా, తెలుగు సంస్కృతి, సాహిత్య అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని, ఆంధ్రప్రదేశ్‌లో సాంప్రదాయ సాహిత్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ రెవెన్యూ అధికారి కె. భాస్కర్, జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత, జిల్లా టూరిజం శాఖ మేనేజర్ యస్. పట్టాభిరామన్న, ఏవో ఎన్.వి. నాంచారయ్య, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.