పెదపాడు/ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 28: ప్రముఖ సాహితీవేత్త శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు బహుభాషా పండితుడని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.
వట్లూరులోని పీఎం శ్రీ డా. బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య ప్రపంచంలో పుట్టపర్తి నారాయణాచార్యులు ధ్రువతారలా వెలుగొందారని పేర్కొన్నారు. 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి, ‘శివతాండవం’ వంటి అద్భుత కావ్యాలను సృష్టించిన మహనీయులని కొనియాడారు.
తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడిగా నిలిచిన మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం, జీవనశైలి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. అలాంటి మహనీయుడి జయంతిని జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సెట్‌వెల్ సీఈఓ ప్రభాకర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవన శాఖాధికారి సాజా నాయక్, ఇంచార్జ్ డీసీఓ భారతి, తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపీడీఓ జమ, పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.


