ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, మార్చి 27: విజయవాడ స్టెల్లా కాలేజి సమీపంలోని సాయిబాబా దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ దంపతులు హాజరై సీతా రాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రతిబింబించాయి.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వాహకులు వారికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి, పూజా కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పించారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని వారు భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు మంగళవాయిద్యాల నినాదాలతో మార్మోగాయి. వేదపండితులు వేదమంత్రోచ్చారణల మధ్య యాగాలు, హోమాలు నిర్వహించగా, అనంతరం సీతారాముల కల్యాణోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
స్థానిక ప్రజలు, మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున హాజరై భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో నిర్వాహకులు క్రమశిక్షణతో, శ్రద్ధతో ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ వేడుకల సందర్భంగా శ్రీరామ తత్వం ద్వారా “అధికారానికి మించి బాధ్యత ముఖ్యమనే సందేశం”, సీతాదేవి తత్వం ద్వారా “కష్టసుఖాలలో సహజీవనం అవసరం”, లక్ష్మణుని ద్వారా “కుటుంబ బాధ్యతల పంచుకోవడం”, ఆంజనేయుని ద్వారా “నమ్మిన ధర్మం కోసం అంకితభావం” వంటి విలువలను భక్తులకు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం, ఐక్యత, మరియు సన్మార్గంలో నడవాలనే సంకల్పాన్ని పెంపొందించేలా విజయవంతంగా ముగిసింది.


