టి.నరసాపురం, పశ్చిమ వాహిని, మార్చి 30: మండలంలోని అల్లంచర్ల రాజుపాలెం గ్రామంలో చెరువులపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, ఆక్రమణలను అరికట్టాలని కోరుతూ సిపిఐ మండల కార్యదర్శి తాడిగడప జయరాజు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ పరిధిలో ఉన్న చెరువులు వ్యవసాయం, భూగర్భ జలాల పెరుగుదలకు కీలకమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ చెరువులలో మట్టి మాఫియా అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తోందని, కొంతమంది భూస్వాములు చెరువు భూములను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కాలువల ప్రవాహాన్ని అడ్డుకోవడంతో వర్షాకాలంలో కూడా చెరువులకు నీరు చేరకపోవడం గమనార్హమని తెలిపారు.
ఈ అక్రమాలను వెంటనే అరికట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని జయరాజు హెచ్చరించారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడమే కాకుండా, రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామ ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెరువులను సంరక్షించడం అత్యంత అవసరమని తెలిపారు.
కావున సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆక్రమణలను తొలగించి, అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆక్రమణలు మరియు మట్టి తవ్వకాలకు గురవుతున్న చెరువుల జాబితా.. ఈదుల చెరువు, మల్లుకుంట చెరువు, రాజకట్ట చెరువు, జంగాల కుంట చెరువు, బాలమ్మకుంట చెరువు, కొల్లయికుంట చెరువు, శేషమ్మకుంట చెరువు, గోరకుంట చెరువు, ఎర్రకుంట చెరువు తదితర చెరువుల అక్రమాలకు గురవుతున్నాయని తాడిగడప జయరాజు తెలిపారు.


