భీమడోలు, పశ్చిమ వాహిని, మార్చి 28: ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పశ్చిమ వాహినిలోని భీమడోలు రైతు సేవా సహకార సంఘం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని సొసైటీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తెలిపారు.
సంఘంలో నిర్వహించిన మహాజన సభలో ఆయన మాట్లాడుతూ, త్రిసభ్య కమిటీ బాధ్యతలు స్వీకరించిన తరువాత గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే వ్యాపారం రూ.4 కోట్ల మేర పెరిగిందని, డిపాజిట్లు సుమారు రూ.90 లక్షలు పెరిగినట్లు తెలిపారు. గతంలో రూ.1 కోటి నష్టాల్లో ఉన్న సంఘాన్ని ప్రస్తుతం రూ.22 లక్షల లాభాల్లోకి తీసుకువచ్చామని వివరించారు.
ఎరువుల విక్రయాల్లో కూడా పెద్ద ఎత్తున పురోగతి సాధించామని చెప్పారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో రూ.11.85 లక్షల నష్టం వచ్చినప్పటికీ, 2025–2026 సంవత్సరంలో రూ.55 లక్షల లాభాలు సాధించామని వెల్లడించారు.
ఇక 2026–2027 సంవత్సరానికి సంఘాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కృషి చేస్తామని గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. అలాగే ఏలూరు డీసీసీబీ బ్యాంకు గతంలో ఉన్న రూ.96 కోట్ల నష్టాన్ని పూర్తిగా తగ్గించి, ప్రస్తుతం ఎటువంటి బాహ్య అప్పులు లేవని తెలిపారు.
ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు గేదల శ్రీనివాసు, వెజ్జు రాంబాబు, బ్యాంకు సీఈఓ నాగేంద్ర, డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్, సహకార సంఘ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం డీసీసీబీ సిబ్బంది వేతన సవరణకు అంగీకారం తెలిపినందుకు గన్ని వీరాంజనేయులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు అభివృద్ధికి మరింత సహకారం అందించాలని సిబ్బందిని కోరారు.


