ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 29: పేదవాడికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి, సంక్షేమం–అభివృద్ధి కలయికతో ఉమ్మడి రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు.
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏలూరులో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమీనాపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్‌కు వరంగా నిలిచిందన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిలో రెండు రూపాయల బియ్యం, పేదలకు గృహాలు, చేనేతకు ప్రోత్సాహం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. నిజమైన రాజకీయాలకు మార్గదర్శకత్వం చూపింది ఎన్టీఆర్ అని అన్నారు.
పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు రావడంలో కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీడీపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ మహిళలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. 44 వసంతాల ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేశారు. పార్టీ సీనియర్ నాయకులు కొల్లేపల్లి రాజు, పొలమరశెట్టి గోపాలకృష్ణ, డోలా పరశురామ్‌లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
.jpg)



