ప్రత్యేకం: రాముడు... దశరథుడి కోసం వనవాసానికి వెళ్లాడు, సీతమ్మ... రాముడి కోసం అరణ్యమార్గం పట్టింది. రాముడు... రాజధర్మాన్ని పాటించాడు, సీతమ్మ... దాంపత్యధర్మాన్ని అనుసరించింది. అతడు... విగ్రహవాన్ ధర్మః, ఆమె... దేవ్యాః కరుణ రూపాయః. ఎంచుకున్న మార్గాలు వేరైనా, ఇద్దరూ సత్యవ్రతులే. రామాయణం... ఓ పరాక్రమవంతుడి ప్రయాణమే కాదు, దాంపత్య ధర్మానికి కట్టుబడిన ఓ ఇల్లాలి విలువల యాత్ర కూడా. కాబట్టే, వాల్మీకి మహర్షి రామకథను ‘సీతాయాశ్చరితం మహత్’ అనీ పిలిచాడు.
అవని నుంచి మిథిలకు,
మిథిల నుంచి అయోధ్యకు.
అయోధ్య నుంచి అరణ్యానికి,
అరణ్యం నుంచి లంకకు.
లంక నుంచి అయోధ్యకు,
అయోధ్య నుంచి అరణ్యానికి.
అంతిమంగా అవనిలోకి!
...సీతామాత సుదీర్ఘ యాత్ర ఇది. రామాయణం... రాముడి ప్రయాణమే కావచ్చు. కానీ, ఆ ప్రస్థానంలో అతని పక్కన సీతమ్మ కూడా ఉంది. దారి పొడవునా... రాళ్లూ రప్పలూ దాటుకునీ, కుట్రలూ కుతంత్రాలూ తట్టుకునీ తానేమిటో చాటుకుంది. ఆదికావ్యంలో సీత ఓ పరిపూర్ణ నాయిక. నమ్మిన విలువలకు కట్టుబడిన పట్టుదల కలిగిన వనిత. నిగ్రహంలో, విగ్రహంలో రాముడికి దీటైన పాత్ర. అప్రతిమా - సాటిలేని స్త్రీమూర్తి, నారీణాం ఉత్తమా - స్త్రీజాతి ఆణిముత్యం, ధర్మనిరతా - ధర్మాచరణకు కట్టుబడిన వ్యక్తి, విశుద్ధ - పరిశుద్ధురాలు... అంటూ వాల్మీకి మహర్షి ఆమె గుణగణాల్ని కీర్తించాడు. సీతమ్మ జీవనం నదీ ప్రవాహాన్ని తలపిస్తుంది. తను మిథిలలో తండ్రిచాటు బిడ్డగా పెరిగింది. మనువు తర్వాత, దశరథుడి కోడలిగా అయోధ్యలో కాలుపెట్టింది. పెనిమిటి శ్రీరాముడికి ప్రేమను పంచింది.
వృద్ధాప్యం మీదపడటంతో, దశరథ మహారాజు శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం జరిపించాలని సంకల్పించాడు. నిండుసభలో తన మనసులోని మాట చెప్పగానే మంత్రి- సామంత-దండనాయకులు ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ‘ఎందుకింత ఉత్సాహం? రాజ్యాధికారం చేపట్టడానికి రాముడికి ఉన్న అర్హతలేమిటి?’ మురిసిపోతూ అడిగాడు దశరథుడు. అందరూ శ్రీరాముడి సద్గుణాలను ఏకరువుపెట్టారు. వసిష్ఠులవారు మాత్రం ‘ఆయన సీతారాముడు కాబట్టి!’ అంటూ తనదైన వాదన వినిపించారు.
స్త్రీ మూలః సర్వధర్మః... ధర్మానికి పునాది మహిళ. ఇల్లాలిగా ఆమె సార్వభౌముడి సమర్థతనూ ప్రభావితం చేయగలదు. జానకి లాంటి ఉత్తమురాలు మహారాణి హోదాలో పాలనలో సహకరిస్తే... రామరాజ్యం మరింత సుభిక్షంగా ఉంటుందని ఆ మహర్షి ఆలోచన. రాజర్షి జనకుడి పెంపకం పట్ల ఉన్న నమ్మకమూ ఆ నిశ్చితాభిప్రాయానికి ఓ కారణం కావచ్చు. నిజమే, యజ్ఞభూమిలో దొరికిన బంగారుతల్లి సీతను ఆయన మామూలు ఆడపిల్లలా పెంచలేదు, ఆత్మవిశ్వాస ప్రతీకగా తీర్చిదిద్దాడు. కాబట్టే, ‘నా కూతురు వీర్యశుల్క. మహావీరులకే తనను పెళ్లాడే అర్హత ఉంది’ అని సాధికారికంగా ప్రకటించాడు.
దేశదేశాల రాకుమారులు సీతను వరించి వచ్చినా, నిర్మొహమాటంగా తిరస్కరించాడు. ముక్కంటి ధనుస్సును ముక్కలు చేసిన రామచంద్రుడినే ఏరికోరి అల్లుడిని చేసుకున్నాడు. ‘రామా! ఇదిగో నా కూతురు సీత. ఆమె చేయి అందుకో. ఇక నుంచీ నీ సహధర్మచారిణి. ఛాయేవానుగతా సదా - జీవితాంతం నీడలా నిన్ను అనుసరిస్తుంది’ అంటూ మంత్రపూర్వకంగా కన్యాదానం చేశాడు. చివరి వరకూ జానకి తన తండ్రి వాగ్దానానికి కట్టుబడి ఉంది.
దాంపత్య బంధం
అంతఃపురంలో ఉన్నా, అడవులకు వెళ్లినా, అశోకవనంలో బందీగా బతుకుతున్నా, వాల్మీకి ఆశ్రమంలో అతిథిగా తలదాచుకున్నా... సీతమ్మ మదినిండా మనువాడినవాడి ఆలోచనలే. రాముడికి కూడా సీత అంటే అపారమైన ప్రేమ. ‘ప్రాణేభ్యోపి గరీయసీ - తను నా ప్రాణం కంటే ఎక్కువ’ అనేవాడు. ఆ దాంపత్య బంధాన్ని ‘హృదయం హృదా’ అని మెచ్చుకుంది రామాయణం. సీతారాములు ఒకరి హృదయంలో ఒకరు సుస్థిరంగా ఉంటారట!
‘రామచంద్రుడి కోసం అడవుల బాట పట్టిన గొప్ప ఇల్లాలివి నువ్వు’ అంటూ సాధ్వి అనసూయ ప్రశంసించినప్పుడు కూడా, ‘రాముడు సార్వభౌముడు కాకపోయినా, ఆ స్థానంలో ఓ నిరుపేద ఉన్నా... నేను ఇలానే స్పందించేదాన్ని. భార్యగా ఇది నా కర్తవ్యం’ అని స్థిరంగా పలికింది సీత. సూర్యవంశ వైభవం, విదేహ వారసత్వం సీత వినయగుణాన్ని వీసమెత్తు కూడా ప్రభావితం చేయలేకపోయాయి. అంతరాంతరాల్లో ఆమె ఓ సాధారణ మహిళ. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు ‘నేను దశరథ పుత్రుడిని’ అని ప్రకటించుకున్నట్టే, లక్ష్మీదేవి స్వరూపమైన సీతమ్మ ‘నేను శ్రీరాముడి ధర్మపత్నిని’ అని మాత్రమే భావించుకుంది. సీతారాములది ప్రేమ-పెళ్లి కాదు, పెళ్లి-ప్రేమ!
ఆత్మాభిమాన స్వరం..
అయోధ్య కాండంలో... సీతమ్మ తొలిసారిగా తన స్వరాన్ని వినిపించింది. భర్త కర్తవ్యాన్నీ, భార్య ధర్మాల్నీ బలంగా ప్రస్తావించింది. ఆ సందర్భంగా చేసిన వాదనలూ, లేవనెత్తిన ప్రశ్నలూ, ఎంచుకున్న తర్కాలూ, ప్రయోగించిన పదాలూ... ఆమె పరిణతిని చాటుతాయి. అదో సంక్షోభ సమయం. తెల్లారితే, శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం. అంతలోనే, కైకేయి అలకపాన్పు ఎక్కింది. అప్పుడెప్పుడో ఇచ్చిన రెండు వరాలను అమలు చేయాల్సిందేనని పట్టుబట్టింది. దశరథుడు ఒప్పుకోక తప్పలేదు.
దీంతో, శ్రీరాముడి వనవాసం ఖాయమైపోయింది. భారమైన హృదయంతో సీతకు ఆ దుర్వార్త చెప్పాడు. తాను లేని సమయంలో ఎవరితో ఎలా మసలుకోవాలో వివరించబోయాడు. ఆ మాటలకు సీత హృదయం గాయపడింది. కలువ కళ్లు ఎర్రబడ్డాయి. భర్త పట్టాభిషేకం ఆగిపోయినా ఆమె పెద్దగా బాధపడలేదు. తనను అయోధ్యలోనే వదిలి వెళ్లాలన్న రాముడి నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా ఖండించింది. ‘నేను మీ అర్ధాంగిని. మామగారు మిమ్మల్ని ఆదేశిస్తే నన్నూ ఆదేశించినట్టే’ అంటూ సర్దిచెప్పబోయింది. రాముడు వినలేదు. ‘అరణ్య మార్గంలో రాళ్లూరప్పలూ నా పాదాల్ని గాయపరుస్తాయనేగా మీ భయం.
అలా అయితే, నేనే ముందు నడుస్తాను. మీ కోసం ఆ ముళ్లూరాళ్లూ నా చేతులతో ఏరేస్తాను. మీ సుఖమే నా సుఖం, మీ దుఃఖమే నా దుఃఖం’ అని వేడుకుంది. అయినా, రాఘవుడి గుండె కరగలేదు. ‘నన్ను తీసుకెళ్లకపోతే... విషం తాగుతాను, మంటల్లో దూకుతాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పటికి కూడా దాశరథిలో చలనం కనిపించలేదు. అన్ని ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, స్త్రీజాతికే సొంతమైన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది. ‘స్త్రియం పురుష విగ్రహం - నువ్వు పురుష రూపంలోని స్త్రీవి. ఆ సంగతి తెలియక మా నాన్న నీకు కట్టబెట్టాడు’ అంటూ మాటల దాడి మొదలుపెట్టింది. దీంతో, రాముడు అయిష్టంగానే ఆమోదం తెలిపాడు.
అదే సమయంలో, సమస్య పరిష్కారానికి రాజగురువులూ రంగంలోకి దిగారు. ‘సీతమ్మ రాముడితోపాటూ అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అర్ధాంగి హోదాలో ఆమెకు రాజ్యాన్ని పాలించే హక్కు ఉంది’ అంటూ ధర్మ సూక్ష్మాల్ని ప్రస్తావించాడు వసిష్ఠ మహర్షి. సీతకు ఆ ప్రతిపాదన నచ్చలేదు. ఆమె దృష్టిలో రాజ్యాలూ, సింహాసనాల కంటే భర్త సాంగత్యమే విలువైంది. అంతలోనే, ప్రజల నిరసనలూ మొదలయ్యాయి. అయోధ్య మహిళలంతా సీతమ్మ పక్షాన నిలిచారు. ‘ఆమె సంరక్షణ బాధ్యత మేం తీసుకుంటాం. రాముడు తిరిగొచ్చేవరకూ ఆ తల్లిని కాపాడుకుంటాం’ అంటూ అడ్డొచ్చారు. వాళ్లను సున్నితంగా వారించి, రాముడి వెనకాలే నడిచింది లోకపావని.
శాంతిప్రియ..
సీత... ధర్మాధర్మ విచక్షణ తెలిసిన మహిళ. అరణ్యవాసంలో... తన అస్త్రశస్త్రాలతో రాక్షస సంతతిని తుదముట్టిస్తానంటూ శ్రీరాముడు మహర్షులకు మాటివ్వడం సీతకు ఏమాత్రం నచ్చలేదు. సృష్టిలోని ఏ ప్రాణితోనూ అకారణ వైరం వద్దని భర్తకు సలహా ఇచ్చింది. అనగనగా కథలో... తాను తిరిగొచ్చేవరకూ జాగ్రత్తగా దాచిపెట్టమంటూ, ఎవరో బాటసారి ఇచ్చి వెళ్లిన ఆయుధం... ఓ మహర్షి ఆలోచనల్ని ఎంత క్రూరంగా మార్చేసిందో, అతని వ్యక్తిత్వాన్ని ఎంతగా దిగజార్చిందో మనసుకు హత్తుకునేలా వివరించింది. ‘వ్యసనాలు మూడురకాలు. ఒకటి అబద్ధం. రెండు పరస్త్రీ వ్యామోహం. మూడు అకారణ క్రూరత్వం. మొదటి రెండు దుర్గుణాలూ మీలో లేవు. ఆ సంగతి నాకూ తెలుసు. మూడో వ్యసనం మాత్రం ఇప్పుడిప్పుడే ఒంటబడుతోంది’ అని సుతిమెత్తగా హెచ్చరించింది.
రాముడు ఆమె అభిప్రాయంతో ఏకీభవించలేదు. అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా క్షత్రియ పుత్రులు ధర్మ పరిరక్షణకు ఆయుధం పట్టాల్సిందేనన్నాడు. దీంతో సీత ఎదురు చెప్పలేకపోయింది. అలా రాక్షసులతో మొదలైన గొడవలు క్రమంగా తీవ్రరూపం ధరించాయి. స్త్రీకి స్త్రీయే శత్రువు... అనే మాట రామాయణ కాలంలోనే పుట్టిందేమో. శూర్పణఖను చూసే అలా అన్నారేమో! కోరకూడని కోరికలు కోరడంతో రామలక్ష్మణులు ఆమెను పరాభవించి పంపారు. ఆ కక్షకొద్దీ ఖరదూషణాది రాక్షసుల్ని ఉసిగొల్పింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో, ఓ కట్టుకథ అల్లి రావణుడి మనసులో విష బీజాలు నాటింది. సీత
అందచందాల్ని తన అగ్రజుడికి వర్ణించి చెప్పింది. ‘ఆమెను నీ భార్యగా చూడాలన్నదే నా తపన. ఆ ప్రయత్నంలో రాముడి వల్ల అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నువ్వు సీతను అపహరించుకుని వస్తే నా కోపం చల్లారుతుంది. నీకూ ఆ సౌందర్యరాశి దక్కుతుంది’ అంటూ అతని పది తలల్లోనూ చెడు తలపులను జొప్పించింది. మొత్తానికి ఒప్పించింది. ఆ కుట్రలో భాగంగానే... మారీచుడు మాయలేడిగా మారాడు. రావణుడు భిక్షకుడి వేషంలో వచ్చి, సీతను ఆకాశమార్గంలో ఎత్తుకెళ్లాడు. అంత విషాదంలోనూ ఆమె ప్రాప్తకాలజ్ఞతతో ఆలోచించింది. ఒంటి మీది నగలను మూటగట్టి కిందికి విసిరేసింది.
ఆ ఆనవాలుతో రాముడు తన జాడ తెలుసుకుంటాడన్న ఆశ. సీతమ్మ ప్రయత్నం వృథాగా పోలేదు. ఆ మూట వానరులతో రామలక్ష్మణుల మైత్రికి కారణమైంది.
రావణ లంకలో…
అశోకవనంలోని సీత... శోకదేవత కాదు. దుఃఖిస్తూనే కూర్చోలేదు. ఓ యోధలా ఆలోచించింది, ధీరలా ప్రవర్తించింది. ‘రావణం భజ భర్తారం - రావణుడిని భర్తగా స్వీకరించు’ అంటూ అసుర కాంతలు బెదిరించిన ప్రతిసారీ, నిర్భయంగా బదులిచ్చింది. ‘ఆ నీచుణ్ని ప్రేమించడం కాదు కదా, ఎడమ కాలితోనూ తాకను. నిలువునా చీల్చినా, ముక్కలుగా నరికినా, నిప్పుల్లో తోసినా... నా నిర్ణయం మారదు’ అని స్థిరంగా చెప్పింది. ఆమెను దారికి తెచ్చుకోడానికి రావణుడు చేయని ప్రయత్నమంటూ లేదు. అతివలకు సహజంగానే ఆభరణాలూ అలంకరణల పట్ల ఆసక్తి ఎక్కువ కాబట్టి, ఆ ధగధగల్నీ ఎరగా వేశాడు. ‘వజ్ర వైడూర్యాలూ, సుగంధ ద్రవ్యాలూ... తానేం అడిగినా కాదనకండి. నా గురించి గొప్పగా చెప్పండి’ అంటూ అంతఃపుర సిబ్బందిని ఆదేశించాడు.
ఆ ప్రలోభాల పాచిక పారకపోయేసరికి భయపెట్టాడు, హెచ్చరించాడు. పన్నెండు నెలల గడువు పెట్టాడు. యుద్ధ సమయంలో రాముడి తలను కృతకంగా సృష్టించి... బంతిలా ఆమె ముందుకు విసిరేశాడు. అయినా, సీత లొంగలేదు. దశకంఠుడిని గడ్డిపోచతో సమానంగా చూసింది. ఆ దైత్యుడితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు గడ్డిపోచను అడ్డం పెట్టుకునే సంభాషించింది. ‘నా రాముడెక్కడా, నువ్వెక్కడా? అతడు సింహం, నువ్వు గుంటనక్కవి. అతడు సముద్రం, నువ్వు పిల్ల కాలువవి. అతడు నెమలి, నవ్వు నీటి కాకివి. అతడు హంస, నువ్వు రాబందువి’ అని మొహం మీదే తిట్టిపోసింది.
తన పక్షాన నిలిచిన విభీషణుడి భార్య సరమ సాయంతో... లంకేశ్వరుడి వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేది. ఏనాడూ రావణుడు పంపే అన్నపానాల్ని ముట్టుకోలేదు. కట్టుబట్టల్ని సైతం మార్చుకోలేదు. ఓరకమైన తపోస్థితిలో కాలం గడిపేది. కాబట్టే, ‘నేను అనుకుంటే ఈ క్షణంలోనే నిన్ను కాల్చి బూడిద చేయగలను. అందుకైనా, నా భర్త అనుమతి తీసుకోవాలి కాబట్టి ఉపేక్షిస్తున్నా’ అని గట్టిగానే హెచ్చరించింది. ‘ఈగ ఆశకొద్దీ వజ్రాన్ని మింగినా జీర్ణించుకోలేదు. నువ్వూ అంతే, నన్ను అపహరించి సుఖంగా ఉండలేవు. సూర్యుడి నుంచి కాంతినీ, రాముడి నుంచి నన్నూ ఎవరూ వేరుచేయలేరు’... అంటూ మాటకు మాటా బదులిచ్చింది.
శింశుపా వృక్షం మీది నుంచీ ఆమె హావభావాల్నీ ఆత్మనిబ్బరాన్నీ గమనించిన హనుమ... ‘సందేహం లేదు, ఈమే సీత! తన కోసం రాముడు రావణుడినే కాదు, సమస్త జగత్తునూ ఎదిరించినా తప్పు లేదు’ అనుకున్నాడు. వెంటనే చెట్టుదిగి వెళ్లి... ‘ఉన్నాడు లెస్స రాఘవుడు, రానున్నాడు, నిను గొనిపోనున్నాడు. నిజము నమ్ము ముర్వీతనయా!’ అని భరోసా ఇచ్చాడు. ఆ మాట సీతలోని నిస్పృహను పోగొట్టింది. వచ్చిన పని పూర్తిచేసుకుని, వెళ్తూ వెళ్తూ లంకకు నిప్పంటించాడు మారుతి. తీరా, లంకంతా అంటుకుపోయాక... ‘అశోకవనం లోని సీతమ్మనూ ఈ నిప్పు దహిస్తే?’ అనే సందేహం కలిగింది. ‘అయినా, నిప్పు, నిప్పును ఎలా కాల్చగలదు?’ అని మనసుకు సమాధానం చెప్పుకుని, నిశ్చింతగా కిష్కింధకు ప్రయాణమయ్యాడు. నిజమే, సీతమ్మ నిప్పే.
ఆత్మాభిమాన పరీక్ష…
రావణ సంహారం తర్వాత, శ్రీరాముడు హృదయపూర్వకంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని ఆశించింది సీతాదేవి. కానీ జరిగింది వేరు. ‘పరగృహంలో గడిపిన నిన్ను ఏలుకోలేను. కావాలంటే, నీకు నచ్చిన చోట ఆశ్రయం తీసుకోవచ్చు...’ అంటూ పరుషంగా మాట్లాడాడు. దీంతో సీతమ్మ నిశ్చేష్టురాలైంది. ‘రామా! నా స్వభావం నీకు తెలియదా? పెళ్లినాటి ప్రమాణాల్ని మరిచిపోయావా?’ అంటూ నిలదీసింది. తనను తాను నిరూపించుకోడానికి, స్వచ్ఛందంగా అగ్నిపరీక్షకు సిద్ధపడింది. ‘నా ఆలోచనల్లో, మాటల్లో, ఆచరణలో... రాముడు తప్ప మరొకరు లేకపోతే అగ్ని నన్ను రక్షించుగాక...’ అంటూ మంటల్లో కాలుపెట్టింది.
ఆ దృశ్యాన్ని చూడలేక వానరులు కన్నీళ్లు పెట్టుకున్నారు, రాక్షస వనితలు సైతం గుండెలు బాదుకున్నారు. అంతలోనే, అగ్నిదేవుడు సీతను వెంటబెట్టుకుని మంటల్లోంచి బయటికి వచ్చాడు. బ్రహ్మాదులు ఆమె దోషరహిత అని ధ్రువీకరించారు. ‘నా సీత రుజువర్తన నాకు తెలియదా? సత్యవ్రతుడిని అయిన నేను ఆ సత్యాన్ని లోకానికి చాటడానికే ఇంత వరకూ ఉపేక్షించాను’ అంటూ సీతమ్మ చేతిని అందుకున్నాడు రాముడు. గతాన్ని ఓ పీడకలలా భావించి, భర్త ఒడిలో ఒదిగిపోయింది... క్షమయా ధరిత్రి!
పట్టాభిషేకం తర్వాత, మరోసారి శ్రీరాముడు లోకోపవాదానికి తలవంచాడు. ఇల్లాలిని అడవుల పాలు చేశాడు. సీతమ్మ స్థానంలో బంగారు బొమ్మను పెట్టుకుని అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. ఆ సమయంలో, వాల్మీకి ఆశ్రమంలో పుట్టిపెరిగిన లవకుశుల రామాయణ గానం విన్నాడు. ఆ ప్రభావంతో, సీతమ్మ తనను తాను పరిశుద్ధురాలిగా నిరూపించుకునే అవకాశం ఇచ్చాడు. ఆమె కూడా అందుకు ఆమోదం తెలిపింది. అనుకున్న సమయానికి, కాషాయ వస్త్రాల్లో వేదిక దగ్గరికి చేరుకుంది.
వాల్మీకి మహర్షి సభాముఖంగా సీత నిజాయతీని చాటి చెప్పాడు. ‘లోకభయంతోనే ఆమెను త్యజించాను. మరో ఉద్దేశం లేదు’ అని మహర్షికి సమాధానమిచ్చాడు శ్రీరాముడు. పరీక్షలో నెగ్గితే మునుపటిలా ప్రేమిస్తానని మాటిచ్చాడు కూడా. సీతకు ఆ మాటలేవీ వినిపించలేదు. ఆ మహా ఇల్లాలి మనసు నొచ్చుకుందో, అవతార పరిసమాప్తికి సమయం ఆసన్నమైందో... కరుణామయి సీత కఠిన నిర్ణయం తీసుకుంది. ‘రాముడే నా సర్వస్వం అయితే, భూదేవి నన్ను తనలోకి ఆహ్వానించుగాక’ అని చేతులు జోడించి ప్రార్థించింది.
మరుక్షణమే, భూమి రెండుగా చీలిపోయి... అందులోంచి నవరత్న ఖచిత సింహాసనం మీద కూర్చున్న భూదేవి బయటికి వచ్చింది. భూజాతను తన పక్కన కూర్చోబెట్టుకుని రసాతలానికి పయనమైంది. శ్రీరాముడు ‘సీతా..సీతా’ అంటూ పరుగుపరుగున అటువైపు వెళ్లాడు. లవకుశులు ‘అమ్మా... అమ్మా’ అంటూ తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజలు సీతమ్మ దాంపత్య ధర్మానికి జేజేలు పలికారు. కొంతకాలానికి, రామావతారమూ పరిసమాప్తమైంది.
వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో రామాయణ మహాకావ్యాన్ని రుషి-ముని గణాలకు పరిచయం చేస్తూ...
‘ఇది రాముని ప్రయాణం కాబట్టి, శ్రీమద్ రామాయణంగా సుప్రసిద్ధం అవుతుంది’ అని ప్రకటించాడు.
హర్షధ్వానాలు మారుమోగాయి.
అంతలోనే, మళ్లీ గొంతు సవరించుకుని…
‘ఇది సీతమ్మతల్లి మహత్తర జీవనగాథ కూడా. అందుకే, సీతాయాశ్చరితం మహత్ - అనీ వ్యవహరిస్తారు’ అని వెల్లడించాడు.
మరోసారి, హర్షధ్వానాలు మిన్నంటాయి. ఆ ప్రతిధ్వనులు భూమాత ఒడిలోని సీతమ్మకూ వినిపించే ఉంటాయి.
తెలుగువారి సీతమ్మ...
సీత వ్యక్తిత్వానికీ తెలుగు మహిళల స్వభావానికీ దగ్గరి పోలికలు ఉన్నాయి. తెలుగు మహిళలాగే సీతమ్మ కూడా సాధుస్వభావి, దయాగుణ సంపన్నురాలు. తన గుండెల్ని గాయపరిచిన కాకాసురుడిని శ్రీరాముడు క్షమించి వదిలేసినప్పుడు తాను అడ్డు చెప్పలేదు. రావణ సంహారం తర్వాత, అశోకవనంలోని రాక్షస వనితలను మట్టుబెట్టేందుకు హనుమంతుడు అనుమతి అడిగినప్పుడు గట్టిగానే వారించింది. ‘తప్పు చేయనివారు ఎవరుంటారు? క్షమించి వదిలేద్దాం. ఎవరి కర్మ వాళ్లు అనుభవిస్తారు’ అని సర్దిచెప్పింది. తమ కష్టాలకు కారణమైన కైకేయిని ఎప్పుడూ పల్లెత్తుమాటా అనలేదు.
సీతమ్మ విశ్వాసాలు తెలుగు మహిళల నమ్మకాలనూ, అయినవారి పట్ల ప్రేమనూ గుర్తుకు తెస్తాయి. గంగా, యమునలను దాటుతున్నప్పుడు... ‘వనవాసాన్ని ముగించుకుని క్షేమంగా తిరిగొచ్చాక మీకు సారెచీరలు పెడతాను తల్లీ!’ అంటూ జలదేవతలకు మొక్కుకుంది. చిత్రకూటానికి వెళ్లే మార్గంలో ఓ ఊడలమర్రి ముందు నిలబడి ‘ఓ వనదేవతా! నువ్వే మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాలి’ అని ప్రార్థించింది. మనవాళ్ల లానే... కొన్నిసార్లు మాట కఠినమే అయినా మనసు మహా సున్నితం!












