చింతలపూడి, పశ్చిమావహిని, 21: చింతలపూడి సర్కిల్ పరిధిలో జరిగిన పలు గోల్డ్ దొంగతనాలను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఎఎస్పీ ఆర్ సుస్మిత విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు సతీష్ కుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఎఎస్పీ సుస్మిత తెలిపారు: ఫిబ్రవరి 27 మరియు మార్చి 3 తేదీలలో చింతలపూడి సర్కిల్ పరిధిలో రెండు దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గణిజర్ల గ్రామంలో బుల్లా భూలక్ష్మి ఇంట్లో మధ్యాహ్న సమయంలో ఎవరూ లేని సమయంలో మెయిన్ డోర్ లాక్, బీరువా తాళాలు పగలగొట్టి బంగారం దొంగిలించారు.
జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫింగర్‌ప్రింట్లు పలు నేరస్థలాల్లో సేకరించిన ఆనవాళ్లతో సరిపోవడంతో పాటు 2024లో పాతిమపురంలో జరిగిన కేసుతోనూ అనుసంధానం కావడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
గణిజర్ల, పాతిమపురం కేసుల్లో దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేసి నిందితులు దుక్కిపాటి కిషోర్, కొట్టే రమేష్, మూర్ల చార్లెస్‌లను రిమాండ్‌కు తరలించారు. వీరు చింతలపూడి పరిసర ప్రాంతాలకు చెందినవారని తెలిపారు. అలాగే ధర్మాజీగూడెం స్టేషన్ పరిధిలో జరిగిన మరో గోల్డ్ దొంగతనం కేసులో క్లూస్ టీం సహకారంతో బోడ ప్రతీప్‌ను అరెస్ట్ చేసి 38 గ్రాముల బంగారం, ఒక డ్యూక్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని కూడా రిమాండ్‌కు పంపించారు.
ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ ఈ దొంగతనాలు జరగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసులను విజయవంతంగా ఛేదించిన సీఐ క్రాంతికుమార్, ఎస్ఐలు సతీష్ కుమార్, వెంకన్న, పోలీస్ సిబ్బంది సీతాదేవయ్య, వెంకటేశ్వరరావు, సత్యనారాయణలకు జిల్లా పోలీస్ శాఖ నుంచి ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.



.jpeg)








