ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 09: అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అవసరార్థులకు ఎలాంటి ఆలస్యం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామని తెలిపారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నియోజకవర్గానికి చెందిన 58 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.32,07,513 విలువైన చెక్కులు అందజేశారు. అలాగే రూ.2,21,727 విలువైన ఒక ఎల్‌వోసి కాపీని కూడా అందించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. అవసరార్థులను చైతన్యపరుస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు.
గత 20 నెలల కాలంలోనే రూ.5,05,39,612 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు నియోజకవర్గంలోని బాధితులకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత మంది బాధితులకు సహాయం అందించేందుకు చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టిడిపి నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, నాయకులు బెల్లపుకొండ కిషోర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.








