ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 09: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు.
కైకలూరు టౌన్ ఎన్‌జీఓ కాలనీకి చెందిన పెనుమాల ప్రసన్న అనే మహిళను వాట్సాప్ ద్వారా సంప్రదించిన గుర్తు తెలియని వ్యక్తులు తాము “ఇండియా నివేశ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్” కంపెనీ ప్రతినిధులమని నమ్మించారు. “నివ్ ప్రో” అనే నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి అధిక లాభాలు వస్తాయని ఆశ చూపడంతో బాధితురాలు వారి మాటలు నమ్మి 2025 నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 మధ్య విడతల వారీగా నగదు ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోయారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ దాసుతో కలిసి లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగదు మళ్లించిన బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. టెక్నికల్ విశ్లేషణ ద్వారా గతంలోనే రూ.1,00,000 బాధితురాలి ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా తిరిగి అందించారు.
దర్యాప్తులో భాగంగా మరో రూ.4,50,000 తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఖాతాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసు బృందం వేలూరు వెళ్లి నిందితుడి వద్ద నుంచి ఆ సొమ్మును రికవరీ చేసింది.
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ స్వయంగా రికవరీ చేసిన రూ.4,50,000 నగదును బాధితురాలికి అందజేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం రూ.5,50,000 బాధితురాలికి తిరిగి లభించగా, మిగిలిన నగదు రికవరీ కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ లింక్‌లను క్లిక్ చేయకూడదని, ప్లే స్టోర్‌లో లేని అనధికారిక పెట్టుబడి యాప్‌లను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా అధికారిక సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ దాసు, మహిళా ఎస్ఐ వల్లి పద్మతో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.








