తాజా వార్తలు

10/recent/ticker-posts

నూజివీడులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో మంత్రి కొలుసు పార్థసారథి


_నాయకులు, కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి పాదాభివందనాలు

ఏలూరు/నూజివీడు, పశ్చిమ వాహిని, మార్చి 29: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, వీరాభిమానులకు రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగువారి ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు స్థాపించిన పసుపు జెండా దశాబ్దాల ప్రస్థానంలో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో పార్టీ జెండా ఎగురవేస్తూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


నూజివీడు పట్టణంలోని పోతిరెడ్డిపాడు టర్నింగ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి పోతిరెడ్డిపాడు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేసి బహిరంగ సభను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ పాల్గొన్న కార్యక్రమాన్ని లైవ్ ద్వారా మంత్రి సహా సభకు హాజరైనవారు వీక్షించారు.

పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను మంత్రి ఘనంగా సన్మానించి, సభకు హాజరైన వారందరితో ప్రతిజ్ఞ చేయించారు.

సభలో మంత్రి మాట్లాడుతూ, 1982 మార్చి 29న ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకొని, కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు.

గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిన్నదని విమర్శిస్తూ, తెలుగుదేశం పార్టీ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, ప్రతి వార్డులో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా ఈ వేడుకలను పండగలా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పార్టీ ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు, వీరాభిమానులు మరియు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.