తాజా వార్తలు

10/recent/ticker-posts

జనగణన తొలి దశ ఇండ్ల జాబితా సేకరణకు శిక్షణ పూర్తి

ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 28: జనగణన కార్యక్రమంలో తొలి దశగా నిర్వహించే ఇండ్ల జాబితా సేకరణకు సంబంధించి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని మాస్టర్ ట్రైనర్ సబ్బితి నరసింహమూర్తి తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరు మండల పరిషత్ మీటింగ్ హాల్‌లో రెండు విడతలుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్లకు సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు. మొదటి విడత మూడు రోజుల పాటు మున్సిపల్ కార్పొరేషన్ హాల్‌లో నిర్వహించగా, రెండో విడత చివరి రెండు రోజులు మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది.

ఈ రెండు విడతల్లో కలిపి మొత్తం 66 మంది ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ అందించినట్లు తెలిపారు. మొదటి విడత శిక్షణను మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు సబ్బితి నరసింహమూర్తి, జనార్ధన్ రావు మాట్లాడుతూ, దేశ ఆర్థికాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమానికి జనగణన కీలకమని తెలిపారు. మే నెలలో జిల్లాలో ఇండ్ల జాబితా సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని, మే 1 నుంచి గృహాలు మరియు ఇతర వివరాలను నమోదు చేయనున్నట్లు చెప్పారు.

జనగణన ప్రక్రియ రెండు దశలుగా నిర్వహించబడుతుందని, రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు నమోదు చేయనున్నట్లు తెలిపారు. తొలి దశ సర్వే అత్యంత ప్రాముఖ్యత కలిగినదిగా, మొత్తం ప్రక్రియ డిజిటల్ విధానంలో జరుగుతుందని వెల్లడించారు.

ప్రతి కుటుంబానికి సంబంధించిన వనరులు, సదుపాయాలు పూర్తిగా నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫీల్డ్ ట్రైనర్లు తమ తమ మండలాల్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఏప్రిల్ మొదటి వారం నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సస్ టెక్నికల్ ఇన్‌చార్జ్ సోను యాదవ్, డీటీ శ్రీను నాయక్, మాస్టర్ ట్రైనర్ నాగ జనార్ధన్ రావు, టెక్నికల్ అసిస్టెంట్ పవన్, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తమ్మిలేరు రోడ్డులోని గృహాలపై నమూనా సర్వే నిర్వహించారు.

జనగణన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడానికి సహకరించిన జిల్లా కలెక్టర్‌కు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.