-పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పొగాకు వేలం కేంద్రాల వద్ద ఆందోళనలు చేపడుతాం..
-ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్..
ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 27: వర్జీనియా పొగాకు కిలోకు సరాసరి ధర రూ.360 రైతుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని, గిట్టుబాటు ధర కల్పించకపోతే పొగాకు వేలం కేంద్రాల వద్ద ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ హెచ్చరించారు.
గురువారం ఏలూరులోని అన్నే భవనంలో వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర సమస్యలపై ఆయన మాట్లాడారు. ఈనెల 25 నుండి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని వేలం కేంద్రాలలో పొగాకు కొనుగోళ్లు నిరాశాజనకంగా ప్రారంభం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది కిలో పొగాకు ధర రూ.295 గా వేలం ప్రారంభం కాగా ఈ సంవత్సరం రూ.265 గా ప్రారంభించారని, రైతులు మాత్రం రూ.295 గా ప్రారంభించాలని కోరినా కొనుగోలు కంపెనీలు, పొగాకు బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.
ప్రస్తుత సీజన్లో రైతులు నాణ్యమైన పొగాకు పండించారని, ఖర్చులు కూడా పెరిగాయన్నారు. పొగాకు రైతుకు పొగబెట్టే ఆలోచనలు విరమించుకోవాలని కోరారు. గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలని, పొగాకు రైతులతో చర్చలు జరపాలని కోరారు. కిలో వర్జీనియా పొగాకుకు రూ.360 ధర కల్పించకపోతే ఆందోళనలు చేయక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా పొగాకు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతులు చేస్తున్న ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.


