తాజా వార్తలు

10/recent/ticker-posts

విశాఖ పోర్టుకు 103 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా… మూడు లారీలు సీజ్


విశాఖపట్నం, పశ్చిమవాహిని, మార్చి 09: విశాఖపట్నం పోర్టును కేంద్రంగా చేసుకుని భారీ స్థాయిలో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పేదల ఆకలి తీర్చాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యం స్మగ్లర్ల చేతుల్లోకి వెళ్లడం వ్యవస్థలోని లోపాలను మరోసారి బయటపెడుతోంది.


తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం పోర్టుకు తరలిస్తున్న మొత్తం 103 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని మూడు లారీల్లో అక్రమంగా తరలిస్తుండగా పౌర సరఫరాల శాఖ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి బియ్యంతో పాటు మూడు లారీలను సీజ్ చేశారు.

అంత పెద్ద పరిమాణంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగడం వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో డ్రైవర్లు, క్లీనర్లు మాత్రమే పట్టుబడుతుంటారు కానీ అసలు సూత్రధారులు మాత్రం బయటపడకపోవడం గమనార్హం.

ఇలాంటి స్మగ్లింగ్ ముఠాలకు కొందరు స్థానిక నాయకులు లేదా అధికారుల సహకారం ఉండొచ్చనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి 103 టన్నుల బియ్యాన్ని కాపాడటం అభినందనీయం. అయితే కేవలం సీజ్ చేయడం మాత్రమే కాకుండా ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలకు చెక్ పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.