పోలవరం / ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహరం అందించాలని, మెనూ పాటించని ఏజెన్సీ లపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. పోలవరం మండలం ఇటికలకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉపాధ్యాయుల విద్యా బోధన, మెనూ ని, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించని ఏజెన్సీ పనివారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, షోకాజ్ నోటీసు జారీ చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రతీరోజు అందించాల్సిన ఆహారంతో కూడిన మెనూ ని నిర్దేశించిందని, ప్రతీ పాఠశాల, వసతి గృహాలలోనూ నిర్దేశించిన మెనూ కి తగ్గకుండా ఆహరం అందించాల్సి ఉంటున్నదన్నారు.
వసతి గృహంలో వండిన ఆహారాన్ని కలెక్టర్ స్వయంగా రుచి చూసారు. ఇటికలకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సరైన ఆహరం అందించలేదని గుర్తించానన్నారు. ఇది సహించరానిదన్నారు. సంబంధిత వంట ఏజెన్సీ కి షోకాజ్ నోటీస్ అందించాలని, ప్రతీరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..లేదా అని ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని 3,4,5,10 వ తరగతులు క్లాసు రూమ్ లకు వెళ్ళి వారు అభ్యసించే పాఠాలు అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. విద్యార్థులతో మమేకమయ్యారు.. ఈ సందర్భంగా విద్యార్థులను పెద్దయ్యాక ఏమి అవుతారని అడిగి తెలుసుకున్నారు. కొంత మంది ఐపిఎస్, సాప్ట్వేరు, డాక్టరు, పోలీసు, టీచర్లు అని చెప్పగా, నోవాపు రెడ్డి అనే విద్యార్థి నేను జిల్లా కలెక్టర్ అవుతానని చెప్పగానే, కలెక్టర్ నవ్వుతూ కస్టపడి సాధించాలని చెప్పారు.
హాజరు పట్టీని పరిశీలించి, హాజరు గాని విద్యార్థులు తల్లి,తండ్రులతో జిల్లా కలెక్టరు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం పాఠశాల పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఆటస్థలం, ఆర్వో ప్లాంటు, టాయిలెట్స్ , తదితర వాటిని పరిశీలించారు.
ఐటిడిఎ పివో కె.రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ డిడి పి.జగన్నాధ రావు, సహాయ గిరిజన సంక్షేమ శాఖ జనార్ధన రావు, తహశీల్దారు బి.సాయిరాజు, యంపిడివో సి.హెచ్.శ్రీనివాసు బాబు, డిప్యూటీ యంపిడివో యల్.రవికుమార్, మండల వివిధ శాఖలు అధికారులు, ప్రిన్సిపాల్ సోయం రామారావు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగు సిబ్బంది, విద్యార్థులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.







