తాజా వార్తలు

10/recent/ticker-posts

దేవుడి చిత్రాలతో రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


ఏలూరు: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష వైసీపీ సభ్యులు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రాలను రాజకీయ ప్రదర్శనలకు వినియోగించడం అత్యంత దురదృష్టకరమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీవ్రంగా ఖండించారు. శనివారం ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


దేవుడి పేరును రాజకీయ లాభాల కోసం వినియోగించడం హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీయడమేనని ఆయన అన్నారు. చెప్పులు, షూలు ధరించి స్వామివారి చిత్రాలతో నినాదాలు చేయడం మహాపచారమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు మత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం లేదని విమర్శిస్తూ, శాసనసభల్లో అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వైసీపీ ఇప్పుడు దేవుడి ఫోటోలతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. హిందూ మత విశ్వాసాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాల పట్ల గత పాలనలో అనేక అవమానకర ఘటనలు జరిగాయని ఆరోపించారు.

టీటీడీ ఆస్తులు, నిధుల వినియోగం, దర్శన టిక్కెట్లు, ప్రసాదాల వ్యవహారాలపై గతంలో వచ్చిన ఆరోపణలు ప్రజలకు తెలిసిందేనని తెలిపారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.