హైదరాబాద్, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: రాజకీయ పార్టీని తాను కచ్చితంగా స్థాపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతోనే పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. జాగృతి రాజకీయ శక్తిగా మారుతుందని తెలిపారు. స్వీయ అస్థిత్వం, ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకోవడం కోసమే రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదని కుండబద్దలు కొట్టారు. రాజకీయ పార్టీ స్థాపిస్తానంటే.. తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత.
తన పక్కన పైరవీకారులు లేరని.. ఎప్పుడూ ఉద్యమకారులే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కవిత. గురువారం నాడు బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టే ఆ పెద్ద మనిషి అధికారం కోల్పోయారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని పరోక్షంగా విమర్శించారు.
గత పాలకులు అహంకారం ఎక్కువై ఓడిపోయారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు సంధించారు. కేసీఆర్ హయాంలో అసెంబ్లీ ముందు ఉద్యమకారుడు ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఉద్యమకారులు బంగ్లా నుంచి బయటకు గుంజుతారని జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత 63 సీట్లతో అధికారం ఇస్తే.. అన్ని పార్టీలను విలీనం చేసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు కాల రాయబడ్డాయన్నారు.
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఎత్తేశారని.. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అరెస్టులు చేశారంటూ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో ఎవర్ని గెలిపించినా.. బీఆర్ఎస్ పార్టీలోకే వెళ్తారన్న పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత.. చిన్న వారికి లాభం జరగలేదని తెలిపారు. కానీ మెగా కృష్ణారెడ్డి మాత్రమే కుబేరుడు అయ్యాడంటూ వ్యంగ్యంగా అన్నారు.
అలాగే ఉద్యమకారులకు న్యాయం చేసే బాధ్యత తీసుకోవాలంటూ ప్రోఫెసర్ కోదండరాంకు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రో.కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల లాంటి వారి వల్లే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మారన్నారు. అయితే రెండేళ్లుగా ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రో.కోదండరాంను ఈ సందర్భంగా కవిత సూటిగా ప్రశ్నించారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో 25 శాతం కోటాను ఉద్యమకారుల పిల్లలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.







