తాజా వార్తలు

10/recent/ticker-posts

దెందులూరు హైవేపై అసాంఘిక కార్యకలాపాలకు చెక్ – పోలీసుల మెరుపు దాడి, పలువురికి కౌన్సిలింగ్


దెందులూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: దెందులూరు నేషనల్ హైవేపై జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి చెక్ పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు.


ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో, పెదవేగి సీఐ సిహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో దెందులూరు పోలీసులు హైవేపై విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా దెందులూరు ఎస్ఐ శివాజీ తన సిబ్బందితో కలిసి హైవే సమీపంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తూ, సమాజానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పట్టుబడిన వారికి ఎస్ఐ శివాజీ సమగ్రంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాల వల్ల సమాజంపై పడే చెడు ప్రభావం, వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ గౌరవంపై వాటి దుష్ప్రభావాలను వివరించారు. చట్టవ్యతిరేక పనులను విడిచిపెట్టి గౌరవప్రదమైన జీవనం సాగించాలని హితవు పలికారు.

జాతీయ రహదారి వెంబడి లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ శివాజీ హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. హైవేపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.

ప్రజలు ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను గమనిస్తే వెంటనే డయల్ 112 కు లేదా దెందులూరు ఎస్ఐ ఫోన్ నంబర్ 9440796654 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.