తాజా వార్తలు

10/recent/ticker-posts

కైకలూరులో హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ – “వేగం వద్దు… ప్రాణం ముద్దు” అంటూ అవగాహన


కైకలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ వెంకట కుమార్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి వాహన తనిఖీలు చేపట్టారు.


ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులను గుర్తించారు. జరిమానాలు విధించకుండా, వారికి అక్కడికక్కడే హెల్మెట్ కొనుగోలు చేయించి రహదారి భద్రతపై అవగాహన కల్పించడం విశేషం. “శిక్షల కంటే భద్రతే ముఖ్యమని” పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

అలాగే మైనర్లు వాహనాలు నడుపుతున్న ఘటనలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో మళ్లీ మైనర్లు మోటార్ సైకిళ్లు నడిపితే, వారితో పాటు వారి తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేగానికి లోనవకుండా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

“వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే సందేశంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.